కాళోజీ కుమారుడు రవి కుమార్ కన్నుమూశారు. హన్మకొండ – ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి కుమారుడు రవికుమార్(68) హన్మకొండ జిల్లా దామెర సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. కాళోజీ గారికి ఏకైక సంతానమైన రవికుమార్ ఆంధ్రా బ్యాంకులో క్లర్క్‌గా పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.
ఇక కాళోజీ కుమారుడు రవి కుమార్ మరణించిన తరుణంలోనే.. బీఆర్‌ఎస్ నేతలు, తదితరులు నివాళులు అర్పించారు. కాగా, రెండు రోజులు కిందటే కాళోజీ జయంతి జరిగింది. పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. మన భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలకపాత్ర అని కొనియాడారు. కాళోజి స్ఫూర్తి, తెలంగాణ సాధనలో, ప్రగతిలో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజి పేరున ప్రతి యేటా పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.