వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యంగా అందించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫారాలు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.