గవర్నర్​ వద్ద పెండింగ్​ బిల్లుల కేసు.. సుప్రీం కోర్టు రియాక్షన్ ఇదే

-

తెలంగాణ శాసనసభ బిల్లులకు ఆమోదం తెలిపినా.. గవర్నర్ తమిళిసై దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉంచడాన్ని సవాల్‌చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ జేబీ పార్డీవాలాల ధర్మాసనం ముందు సోమవారం రోజున విచారణకు వచ్చింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నందున తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేయాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే దాన్ని వ్యతిరేకించారు.

ఈ విషయంలో గవర్నర్‌కు సలహా ఇవ్వొచ్చని సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. దీనిపై దవే స్పందిస్తూ ఏ విషయమూ ఈనెల 29వ తేదీన చెప్పేలా సూచించాలని కోరారు. అప్పుడు సీజేఐ జోక్యం చేసుకుంటూ సొలిసిటర్‌ జనరల్‌ ఏప్రిల్‌ 10వరకు సమయం కావాలంటున్నారు కదా? అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ బిల్లులన్నింటినీ అసెంబ్లీ పాస్‌ చేసిందని, అలాంటప్పుడు జాప్యం ఎందుకని దుష్యంత్‌ దవే పేర్కొన్నారు.

అప్పుడు తుషార్‌ మెహతా స్పందిస్తూ తాను గవర్నర్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని, అందువల్ల విచారణను 10కి వాయిదా వేయాలన్నారు. అయితే దుష్యంత్‌ దవే దాంతో విభేదించారు. తర్వాత దుష్యంత్‌ దవే ఈ కేసును ఈనెల 29కి వాయిదావేసి, అప్పటిలోగా సొలిసిటర్‌ జనరల్‌ తదుపరి నిర్ణయాన్ని చెప్పేలా ఆదేశించాలని కోరారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ 29వ తేదీ అంటే గవర్నర్‌కు ఒక్కరోజే సమయం ఇచ్చినట్లవుతుందని, వచ్చేవారం కేవలం 2రోజులే మిసిలేనియస్‌ డేస్‌ వస్తాయని, అందువల్ల 10కి వాయిదా వేస్తామని చెప్పారు. ఆరోజు ఏం చెబుతారో చెప్పనివ్వండంటూ విచారణను వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version