వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో తాను కూడా ఉన్నట్లు టీన్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం ఓ వెబ్‌సైట్ ఎమ్మెల్సీ రేసులో టీ న్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీనివాస్..? అంటూ కథనం రాసింది. దీంతో ఈ కథనం వైరల్ కావడంతో ఆయనే స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చినట్లుగా సదరు వెబ్‌సైట్ అప్‌డేట్ చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో తాను కూడా ఉన్నట్లు టీన్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీనివాస్ స్పష్టం చేసినట్లుగా మరో కథనంలో పేర్కొంది. వాస్తవానికి కొద్ది రోజులుగా ఆయన ఖమ్మంలోని కీలక నేతలతో టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలను, ఎంపీని, మంత్రిని స్వయంగా కలుస్తూ వెళ్తున్నారు.
ఖమ్మంలో అవకాశం చేజిక్కిచుకునేందుకు నేతల సహాయం తప్పనిసరి అని గుర్తించిన ఆయన అధిష్ఠానం పెద్దల సూచనతోనే ఖమ్మం, వరంగల్, నల్గొండ ముఖ్య నేతలతో టచ్‌లోకి వెళ్తున్నట్లుగా స్పష్టం అర్థమవుతోంది. కేటీఆర్ సూచన మేరకే ఆయన బరిలోకి దిగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు టీ న్యూస్ ఎండీ జోగిని సంతోష్‌కుమార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడిగా మెదులుతారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. మీడియా ప్రతినిధులకు రాజకీయాల్లో అవకాశం కల్పించడంలో మిగతా పార్టీలతో పోల్చితే టీఆర్ ఎస్ ముందుంటోంది.
ఇప్పటికే ఆ పార్టీ నుంచి క్రాంతికుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల అకాలంగా మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే కూడా ఒకప్పుడు సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన వారే. ఇప్పుడు ఎమ్మెల్సీ రేసులో శ్రీనివాస్ పేరు తెరపైకి వస్తోంది. వాస్తవానికి చాలా మంది నేతలు, టీఆర్ ఎస్ విలో పనిచేస్తున్న విద్యార్థి సంఘానికి చెందిన నేతలు క్యూలో ఉన్నప్పటికీ శ్రీనివాస్ పేరు తెరపైకి రావడాన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
గత రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఓటర్ల జాబితాను ముందేసుకుని ఆశావహులు కుస్తీ పడుతున్నారు. పట్టభద్రుల ఎన్నిక గురించి మొదట్లో అంతగా ఆసక్తి లేకపోయినప్పటికీ గత రెండు ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన విధానంలో భారీ తేడా కనిపించింది. దీంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరగడానికి కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.