తెలంగాణ సర్కార్ బడుల్లో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 4,500 నుంచి 5,000 మంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేశాక ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. కొత్తగా నియామకాలు పూర్తయ్యే వరకు 13 వేల మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉందని విద్యా శాఖ ప్రతిపాదించింది. అనంతరం పూర్తిస్థాయిలో కసరత్తు చేశాక 5,500 వరకు కొత్త నియామకాలు జరపాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దాదాపు నాలుగు వేల పోస్టులకు కోత పడినట్లే.
సెప్టెంబరు 15వ తేదీన టెట్ నిర్వహిస్తున్నందున, ఆ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ స్వచ్ఛ కార్మికులు, రాత్రి కాపలాదారులను నియమించనున్నారు. మనఊరు- మనబడి మొదటి విడత కింద ఎంపికైన పాఠశాలలతోపాటు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మొత్తం 11,068 చోట్ల వారిని నియమించాలని కోరింది. వారికి నెలకు రూ.6 వేల వరకు గౌరవ వేతనం అందించాలని భావిస్తున్నారు.