సంజూ శాంసన్ 2017 లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఫ్యూచర్ స్టార్ అవుతాడని అప్పుడు అందరి ప్రశంసలు పొందిన సంజూ.. ఎనిమిదేళ్ల తర్వాత కూడా జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంజూకి అరకోర అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. అతడిని పూర్తిగా వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం లేనట్టు వ్యవహరిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కీపర్లుగా రాణించడం కూడా సంజూ తుది జట్టులోకి రాలేకపోతున్నాడు.
ఐపీఎల్ 2023 లో రాణించిన సంజూ శాంసన్ ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో అవకాశం దక్కింది. ఆపై వెస్టిండీస్ లో అవకాశం వచ్చినా.. పేలవ ప్రదర్శన చేశాడు. దాంతో ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికయ్యాడు. అదే సమయంలో కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ వచ్చినా.. ఆసియా కప్ కోసం వదిలేశాడు. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించి సూపర్ 4 మ్యాచ్ ల కోసం శ్రీలంకకు రావడంతో సంజూ స్వదేశానికి వచ్చేసాడు. రాహుల్ కోలుకోకపోతే.. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్ గా సంజూని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అందుకుంది. ఈ కారణంగానే చైనాలో త్వరలో జరగాల్సిన ఆసియా క్రీడలకు కూడా సంజూని ఎంపిక చేయలేదు.
ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్ సెంచరీ చేయడం, ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ లో రాణించడంతో సంజూ శాంసన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో కూడా సంజూకి చోటు దక్కలేదు. దాంతో ఏడవాలో లేదా నవ్వాలో అర్థం కాని అతడు ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఎమోజిని పోస్ట్ చేశాడు.