మరో 24 గంటల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఓటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు కూడా ప్రకటించింది. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మీరు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా..? అసలు ఓటు ఎలా వేయాలో మీకు తెలియదా..? పోలింగ్ కేంద్రంలో ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలియదా..? అయితే పదండి ఇవన్నీ తెలుసుకుందాం.
- తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు.. పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో ఓటరు తన పేరు కలిగి ఉండాలి.
- ముందుగా మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం సంబంధిత బీఎల్‌వో(బూత్ లెవెల్ ఆఫీసర్)లు ఇచ్చే పోల్ చీటీల వెనుక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పోలింగ్ కేంద్రం తెలుస్తుంది.
- పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల గుర్తులు, కండువాలు, వస్త్రాలు ధరించకూడదు.
- పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను తీసుకువెళ్లకూడదు.
- ఓటు హక్కు వినియోగించుకునే వారికి పోల్ చీటీ ఒక్కటే ప్రామాణికం కాదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 16 ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్తేనే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.
- ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఫొటో తీయడం వంటివి చేయకూడదు.