తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేయనుంది. ఈ మేరకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రకటన చేశారు. రైతు హామీల సాధన దీక్ష ఈ నెల 30న చేస్తామన్నారు. అధికారం లోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయిన ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు… కానీ చేయలేదని నిప్పులు చెరిగారు.
రుణ మాఫీ సగం మందికి చేయలేదని ఆగ్రహించారు. ఎక్కడకు వెళితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారు…రాహుల్ గాంధీ చేతుల మీదుగా రైతు డిక్లరేషన్ చేయించారని మండిపడ్డారు. రుణమాఫీ పై రేవంత్ రెడ్డీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు రుణమాఫీ జరగలేదు అని అంటున్నారని గుర్తు చేశారు. బోనస్ అనేది బోగస్ అన్నారు. ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో ఈ నెల 30 న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష ఉంటుందన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు.