రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరింది. మంత్రివర్గం కూడా ఏర్పాటైంది. కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అయితే త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం సాగుతోంది. తుది విస్తరణలో అవకాశం కోసం పలువురు నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19వ తేదీన దిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన సీఎం రేవంత్ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవకపోయినా.. నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజ్‌ఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్‌అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కు అవకాశాలు ఉండవని సమాచారం. అంజన్‌కుమార్ యాదవ్(ముషీరాబాద్), మధుయాస్కీ(ఎల్బీనగర్), ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.