తెలంగాణను చలిపులి వణిగిస్తోంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక మన్యం ప్రాంతాలు చలిమంట లేనిదే నిద్రపోవడం లేదు. స్వెటర్లు, మఫ్లర్లు లేనిదే బయట అడుగుపెట్టడం లేదు. పట్టపగలు కూడా శరీరమంతా ఉన్ని వస్త్రాలతో కప్పుకోకుండా బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు గజగజలాడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి రాష్ట్రంలోనే అతి తక్కువగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 11.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించాయి. వచ్చే నాలుగు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11-15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కమ్ముకుని వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. హైదరాబాద్ – వరంగల్ – ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – నిజామాబాద్, కరీంనగర్ మార్గాల్లో ఉదయం సమయాల్లో పొగమంచు అలుముకుంటుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.