శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడంపై మంత్రి మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని, చట్టసభలను అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని విమర్శించాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల నిర్ణయాలను అవమానించేలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంది.
ఈ క్రమంలోనే రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తిప్పి పంపిన పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ బిల్లులను మళ్లీ శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించి పంపాలని డిసైడ్ చేసింది. రెండోసారి పంపిన బిల్లులను విధిగా గవర్నర్ ఆమోదించాల్సిందేనని మంత్రిమండలి సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం రోజున సుదీర్ఘంగా.. ఐదు గంటలకు పైగా సమావేశం అయింది. భారీ ఎజెండాలో దాదాపు 50కి పైగా అంశాలపై ఆమోద ముద్ర వేసింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై విస్తృతంగా సమీక్షించింది.