ఆచార్య జయశంకర్‌ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని సీఎం ఆదేశం

-

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గురువారం రోజున 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు షురూ చేసింది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలనూ పరిశీలిస్తోంది.

ఇందులో భాగంగానే ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రాథమిక నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపూర్ గ్రామంలో భాగంగా ఉన్న అక్కంపేటను ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ప్రతిపాదించారు. అభ్యంతరాలు, వినతులకు పక్షంరోజులు గడువు ఇచ్చారు.

కుమురంభీం పుట్టినగడ్డ ఇంద్రవెల్లి గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద ఉన్న స్మృతివనం సుందరీకరణ, అభివృద్ధికి ఎకరం భూమి కేటాయించారు. సీఎం ఆదేశాల మేరకు ఇంద్రవెల్లి-బి గ్రామం 240 నంబర్ సర్వే నంబర్‌లో ఎకరం భూమిని కేటాయించారు. సుందరీకరణ, అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news