తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అయ్యాయి. మొదటగా పలువురు ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్‌ను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్ స్థానంలో రేవంత్, భట్టి కూర్చోబెట్టారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికిందని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని కోరారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని సూచించారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.
మరోవైపు గడ్డం ప్రసాద్‌కు భట్టి విక్రమార్క అభినందనలు చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేనేతల సమస్యలను పరిష్కరించారని గుర్తుచేశారు. గడ్డం ప్రసాద్‌తో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు