ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలపై నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

-

తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తూ తాము చేపట్టబోయే కార్యక్రమాల విధివిధానాలు రూపొందించే పనిలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాత పరీక్షలపై సమీక్ష నిర్వహించనున్నారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ తదుపరి నియామక ప్రక్రియపై సమీక్షలో చర్చించనున్నారు. అదే విధంగా గ్రూప్‌-2 పోటీ పరీక్షలు, గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రూప్-3 షెడ్యూల్‌ ఖరారుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల ప్రక్రియపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన నిర్ణయాన్ని తెలిపిన అనంతరం ఆయన రాజ్​భవన్​లో గవర్నర్ వద్దకు వెళ్లారు. అక్కడ తమిళిసై సౌందరరాజన్​కు తన రాజీనామా లేఖను సమర్పించగా ఆమె ఆమోదించారు.

Read more RELATED
Recommended to you

Latest news