ఓవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 18న జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో.. ప్రత్యేక పూజల తర్వాత రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని పీసీసీ వెల్లడించింది. 18వ తేదీ నుంచి 21 వరకు నాలుగురోజులపాటు 15కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. నాలుగురోజులు సాగే బస్సుయాత్ర ప్రతిరోజు మూడునుంచి నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగేలా…. కార్యాచరణ రూపకల్పన చేసినట్లు పేర్కొంది.
ప్రతి నియోజకవర్గంలో ఒకసభ ఉండేలా.. 30 వేలకు తక్కువ లేకుండా జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రైతు సమస్యలు సహా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ఆ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టడంతోపాటు ఓటర్లను ఆకర్షించేలా ప్రియాంక, రాహుల్ గాంధీ ప్రసంగాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్ర నేతలంతా ఐక్యంగా ఉన్నారన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఆ బస్సు యాత్ర దోహదపడుతుందని పార్టీ అంచనావేస్తోంది. రెండు మూడ్రోజుల విరామం తర్వాత తిరిగి బస్సు యాత్ర ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.