తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ జరగనున్న విషయం తెలిసిందే. ఈ కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అమాత్యుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే పట్నం మహేందర్‌రెడ్డితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవద్దంటూ కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌కు లేఖ రాసింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచే కేసీఆర్ సర్కార్ నైతికంగా ఆపద్ధర్మ ప్రభుత్వమేనని పేర్కొంది.
తాండూర్ నుంచి టికెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని…. ఆయనను బుజ్జగించేందుకే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖలో పేర్కొన్నారు. మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఈ నిర్ణయం అనైతికమని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రలోభ పెట్టడమే అవుతుందని నిరంజన్ రెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున.. మహేందర్‌రెడ్డి నియామకాన్ని గవర్నర్ తిరస్కరించాలని కోరారు. ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించకూడదని… ఎన్నికల ప్రక్రియ అపహాస్యము కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.