పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళో రేపో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.
శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఏఐసీసీ కోశాధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ యోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అధిష్ఠానం అజయ్ మాకెన్‌ను తెలంగాణ నుంచి అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఈ నెల 15న పార్టీ సమావేశం కోసం హైదరాబాద్ వస్తున్న ఆయన ఆరోజే నామినేషన్ కూడా వేస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్ర కోటా అభ్యర్థిత్వం కోసం మాజీ ఎంపీ వీహెచ్‌తోపాటు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్య క్యూలో ఉన్నారు. మాజీ ఎంపీ రేణుకాచౌదరి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు.