తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో ముందడుగు వేసింది. అందు కోసం వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు.. ఎస్సీ వర్గీకరణపై చట్ట బద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టనున్నది. వాటిపై అసెంబ్లీలో చర్చ, ఆమోదం తర్వాత ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం దాల్చనున్నది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బిల్లు ప్రవేశపెడుతారు.
విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించే చారిత్రక నిర్ణయాన్ని ఆమోదించనున్నారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తారు. ఈ రెండు చట్టాలను అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించనున్నది. మొత్తం మూడు బిల్లులు ముసాయిదా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ముసాయిదాకు తుది రూపు ఇవ్వనున్నారు. తరువాత రోడ్డుమాప్ ఖరారు చేస్తారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత మూడు చట్టాలను కేంద్ర ఆమోదానికి ప్రభుత్వం పంపించనున్నది.