రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అభయహస్తం గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు గ్యారంటీలను అమలు పరిచింది. ఇక తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈనెల 11వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఈ నేపథ్యంలో ఈ పథకం కోసం ప్రభుత్వం హడ్కో నుంచి 3 వేల కోట్ల రుణం సమీకరిస్తోంది. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 95 వేల 235 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు సర్కార్ తెలిపింది. రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌజింగ్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ 3వేల కోట్ల రుణంతో గ్రామాల్లో 57 వేల 141.. పట్టణాల్లో 38 వేల 94 ఇళ్లను నిర్మించ తలపెట్టినట్లు జీవోలో గృహనిర్మాణ శాఖ పేర్కొంది. అర్హులకు స్థలం, 5లక్షల రూపాయలు.. సొంత జాగా ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలను ఇందిరమ్మ పథకంలో మంజూరు చేయనున్నారు.