రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ వంటి హామీలు అమలు చేసింది. ఆరు గ్యారంటీల అమలకు దరఖాస్తుల ప్రక్రియ షురూ చేసింది. ఈ తరుణంలో మరో కీలక హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ హామీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. ఈ హామీ అమలుకు ప్రతి నెలా ఎంత అవసరం అవుతుందో నివేదించాలని సూచించినట్లు తెలిసింది. అర్హతలతోపాటు ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.