వరంగల్ – ఖమ్మం – నల్గొండ శాసన మండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం (మే 13వ తేదీ 2024) ముగిసింది. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో ఒకరు యువతరం పార్టీ అభ్యర్థి కాగా.. మిగిలిన 10 మంది స్వతంత్ర అభ్యర్థులు.
ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లున్నారు. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభద్రుల ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్, కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు.