తెలంగాణలో కొన్ని నెలల క్రితం పేపర్ లీక్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఓవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే.. మరోవైపు పదో తరగతి పరీక్షా పత్రాలు బయటకు లీక్ కావడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన విద్యార్థిని అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతడిని అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేశారు.
అయితే తాజాగా పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో విద్యార్థిపై అధికారులు పెట్టిన డీబార్‌ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నపత్రం లీక్ ఘటనకు సంబంధించి హనుమకొండ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీశ్‌ను డీఈవో డీబార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో హరీశ్ పదో తరగతి పరీక్షలు రాశారు. కానీ, ఫలితాలను అధికారులు విత్ హెల్డ్‌లో పెట్టారు. తాజాగా డీబార్ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా హరీశ్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించింది.