రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి మూహూర్తం ఖరారైంది. హైకోర్టు భవన నిర్మాణ పనులకు బుధవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. వ్యవసాయ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దని విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల జంతు, పక్షి, ఔషధ వృక్షజాతులు, లక్షల వృక్ష సంపద నాశనం అవుతుందని వాపోయారు. మరోవైపు హైకోర్టు భవన నిర్మాణాన్ని అడ్డుకోవడానికి విద్యార్థి విభాగాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట, బుద్వేలు గ్రామాల పరిధిలోని ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. బుద్వేలులోని 2,533 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించగా.. హైకోర్టు నూతన భవన నిర్మాణ అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరాలను కొత్త భవనానికి కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.