ఎన్నికల వివాదాల కేసులు ప్రస్తుతం రాష్ట్ర నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరో 28 ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వేగం పుంజుకుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ పెరిగింది.
ఇక తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను వేశారు. వనమా విజ్ఞప్తిని తాజాగా హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును కొట్టివేసింది.
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ ఈనెల 25వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కొత్తగూడెం శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ నిన్న వనమా వెంకటేశ్వరరావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం వనమా విజ్ఞప్తిని నిరాకరించింది.