ఇటీవల రాజస్థాన్‌లో కలకలం రేపిన ‘రెడ్ డైరీ’ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రెడ్ డైరీలోని రహస్యాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని నాశనం చేస్తాయని అన్నారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు అందులో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజస్థాన్‌లోని సీకర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 1.25 లక్షల ‘పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
యూరియా ధరల భారం రైతులపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు. భారత్‌లో యూరియా సంచి ధర 266 రూపాయలని.. అదే పాకిస్థాన్‌లో దాదాపు రూ.800గా ఉందని అన్నారు. బంగ్లాదేశ్‌లో రూ.720, చైనాలో రూ.2100లకు దొరుకుతాయని మోదీ పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ వికాసం సాధ్యమని చెప్పారు. నగరాల్లో లభించే ప్రతి సౌకర్యాన్ని పల్లెలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.