TSPSC పేపర్ లీక్.. నలుగురు నిందితులకు గ్రూప్-1 పరీక్ష రాసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు అనుమతివ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న యాభై మంది ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా  TSPSC శాశ్వత డీబార్ చేసింది. డీబార్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన షమీమ్, సురేష్, రమేష్, సాయి సుష్మితకు హాల్‌టికెట్లు జారీ చేసి పరీక్షకు అనుమతివ్వాలని సింగిల్ జడ్జి ఆదేశించారు.

సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ TSPSC  హౌజ్‌మోషన్ దాఖలు చేసింది. టీఎస్పీఎస్సీ అత్యవసర పిటిషన్‌పై జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఇంట్లో విచారణ జరిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలకంగా ఉన్న ఆ నలుగురిపై సిట్ ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసిందని.. వారిని పరీక్షకు అనుమతిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని టీఎస్పీఎస్సీ వాదించింది. చార్జిషీట్ వేసినంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని.. నిర్దోషిగా తేలితే ఆ తర్వాత పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం TSPSC అప్పీలును కొట్టివేసింది. పరీక్షకు అనుమతించి వారి ఫలితాలను ప్రకటించవద్దని సింగిల్ జడ్జి ఆదేశించినందున.. అందులో అత్యవసరంగా జోక్యం అవసరం లేదని పేర్కొంది

Read more RELATED
Recommended to you

Latest news