వీఆర్వోలను ఇతర ప్రభుత్వ విభాగాల్లోకి బదలాయింపు చేస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని బుధవారం హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 121 ఆధారంగా ప్రభుత్వం చేపట్టిన వీఆర్వోల బదలాయింపు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శులతోపాటు భూపరిపాలన ప్రధాన కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
మిగులు సిబ్బందిగా వీఆర్వోలను గుర్తిస్తూ వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లోకి సర్దుబాటు చేసేలా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 121ను సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన సీహెచ్.నాగేంద్రబాబు, మరో ఇద్దరితోపాటు తెలంగాణ వీఆర్వోల సంఘం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై బుధవారం జస్టిస్ పి.మాధవిదేవి విచారణ చేపట్టారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలన్న అభ్యర్థనను అనుమతించలేమని, ప్రభుత్వ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు. పిటిషనర్లను వారు పనిచేస్తున్న జిల్లాలోనే సర్దుబాటు చేస్తుండటం వల్ల మరీ ఇబ్బందిపడే అవకాశం లేదన్నారు. అయితే ఈ సర్దుబాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.