తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఈనెల 9వ తేదీన మంగళవారం ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్ క్రమబద్దీకరణ పూర్తయింది. ఈ మేరకు వారికి వ్యక్తిగతంగా ఆదేశాలు వెళ్లాయి. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,096 మంది, డిగ్రీ కాలేజీల్లో 280 మంది, పాలిటెక్నిక్ కాలేజీలో 520 మందికి నియామక ఉత్తర్వులు అందించారు. కాగా, ఏప్రిల్ 30న పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 5,455 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు.