ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని విద్యార్థులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ మూల్యాంకన ప్రక్రియను మార్చి 10వ తేదీ నుంచి ప్రారంభించి మొత్తం 4 విడతల్లో ఏప్రిల్ 10వ తేదీన పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఈసీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకండ్ ఇయర్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ఈ నెల 20వ తేదీ తర్వాత పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 21 లేదా 22 తేదీలలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.