నీటిపారుదల శాఖలో ఇద్దరు ఈఎన్సీలపై వేటు

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లపై వేటు వేసింది. ఈఎన్సీ (జనరల్‌) మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశిస్తూ.. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల(రామగుండం) ఈఎన్సీ వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొంది.

మంత్రి ఉత్తమ్ కుమార్ కార్యాలయం నుంచి ఆదేశాలు రాగా.. వెంకటేశ్వర్లును సర్వీసు నుంచి తొలగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు ఈఎన్సీలపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అసెంబ్లీలో కాళేశ్వరం, కృష్ణాజలాల అంశం ప్రధాన చర్చనీయాంశం కానున్న నేపథ్యంలో ఇద్దరినీ తొలగించడం నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది.

నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా 2013లో పదవీ విరమణ చేసిన మురళీధర్‌ సర్వీసును అప్పటి ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సర్వీసును పొడిగించడంతో దశాబ్దకాలానికి పైగా ఆయన సర్వీసు ఎక్స్‌టెన్షన్‌లో ఉన్నారు. కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా(రామగుండం) పదవీ విరమణ చేసిన నల్లా వెంకటేశ్వర్లు సర్వీసును గత ప్రభుత్వం పొడిగించగా మూడేళ్లుగా సర్వీసు పొడిగింపులో ఉన్నారు.  వచ్చే మార్చి వరకు ఆయన సర్వీసు ఉండగా తాజాగా ఆయనను సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Read more RELATED
Recommended to you

Latest news