తెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీ ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. టీఎస్ ఎంసెట్ పరీక్షలను మే 10వ తేదీ నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగానికి రెండు రోజులపాటు, ఇంజనీరింగ్ విభాగానికి మూడు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ తో పాటు ఈసెట్, లాసెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
కాగా, ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును విద్యార్థులే స్వయంగా ఆన్లైన్లో చెల్లించే సౌకర్యాన్ని ఇంటర్ బోర్డు తీసుకురానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయనుంది. విద్యార్థులు ప్రస్తుతం కాలేజీల ద్వారా పరీక్ష ఫీజులు చెల్లిస్తుండగా, పలు కాలేజీల్లో అధిక ఫీజును వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విద్యార్థులకు నేరుగా ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని బోర్డు నిర్ణయించింది.