తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ నియమితులైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర కొత్త గవర్నర్‌గా ఆయన ఈ నెల 31వ తేదీన ప్రమాణం చేయనున్నారు. అదే రోజు ఆయన తెలంగాణకు చేరుకోనున్నారు.
తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా.. ఆయన త్రిపురలో సోమవారం రోజున విలేకరులతో మాట్లాడారు. త్రిపుర నుంచి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తిని తానేనని వెల్లడించారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ నుంచి కాల్ వచ్చేంతవరకూ తన నియామకం గురించి తెలీదని చెప్పారు. ‘మీరు త్రిపుర రాష్ట్రం వెలుపల పనిచేయాల్సి ఉంటుంది’ అని మోదీ చెప్పారని.. తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధమేనని ఆయనకు చెప్పానని జిష్ణు దేవ్ తెలిపారు.. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నుంచి మరో కాల్ వచ్చిందని.. తనకు స్వాగతం పలుకుతూ ఆయన ఫోన్ చేశారని వెల్లడించారు. గతంలో తాను త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పదవిలో బాధ్యతలు నిర్వర్తించానని, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకొంటూ.. తన విధులు నిర్వర్తిస్తానని వివరించారు.