కాస్త గ్యాప్ తర్వాత తెలంగాణను ఇవాళ మళ్లీ వరణుడు పలకరించాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. అయితే ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈరోజు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం రోజున ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ అధికారులు చెప్పారు. ఇవాళ దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది.