ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలలో నైరుతి రుతుపవనాలు పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాల యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిసినా సెప్టెంబరులో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ వారాంతంలోనే దక్షిణాదిలో, మధ్య భారతంలో వానలు పడతాయని తెలిపారు. సెప్టెంబరు నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మి.మీ. కాగా దానిలో 9% అటూ ఇటూగా నమోదవుతుందని చెప్పారు.