తెలంగాణ ఆర్టీసీ ‘గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌’.. సెలవు తీసుకోకుండా పనిచేస్తే క్యాష్ ప్రైజ్​

-

బతుకమ్మ, దసరా పండగలు సమీపిస్తున్నాయి. వీటి తర్వాత వచ్చే నెలలో దీపావళి, ఆ తర్వాత నెలలో క్రిస్మస్, ఇక దాని అనంతరం న్యూ ఇయర్, సంక్రాంతి. ఇలా ఈ మూడు నెలలు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొననుంది. ఇక పండుగ వచ్చిందంటే నగర వాసులంతా సొంతూళ్లకు పయనమవ్వడం కామన్. అందుకే వీరి ప్రయాణం సులువుగా.. సాఫీగా సాగేందుకు తెలంగాణ ఆర్టీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే దసరాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ యాజమాన్యం.. ఇప్పుడు మరిన్ని బస్సు ట్రిప్పులను అందుబాటులోకి తీసుకువస్తోంది.

రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు, దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి ఇలా వరుస పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని జనవరి 22వ తేదీ వరకు 100 రోజుల ‘గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌’కు తెలంగాణ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఈ సవాలును స్వీకరించాలంటూ సంస్థ ఎండీ సజ్జనార్‌.. డ్రైవర్లు, కండక్టర్లకు లేఖ రాశారు.

రిటైర్మెంట్లే తప్ప నియామకాలు లేకపోవడంతో ఆర్టీసీలో సరిపడా డ్రైవర్లు, కండక్టర్లు లేక.. వారాంతపు సెలవుతో పాటు ఇతర సెలవులు వాడుకోవడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడుతోంది. దీనివల్ల బస్సుల్ని రద్దు చేయాల్సి రావడం.. ఫలితంగా సంస్థ ఆదాయాన్ని కోల్పోవడం జరుగుతోంది. ప్రస్తుతం పండుగల సమయం కావడంతో ఆర్టీసీ…. అదనపు కి.మీ. నడపడంతో పాటు సెలవులు, సీ ఆఫ్‌లు తీసుకోకుండా పనిచేస్తే సిబ్బందికి ‘క్యాష్‌ అవార్డు’లు ఇస్తామని ప్రకటించింది. దీని ద్వారా ప్రతిరోజు అదనంగా రూ.1.64 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని, 100 రోజుల గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌తో రూ.164 కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని ఆర్టీసీ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news