తెలంగాణలో చలి రోజురోజుకు పెరిగిపోతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఇక పొగమంచు ఉదయం 10 గంటలైనా వీడటం లేదు. రహదారులను మంచు దుప్పటి కప్పడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట పాఠశాలలు, కళాశాలలు, ఇతర పనుల మీద బయటకు వెళ్లే వారు చలికి వణుకుతున్నారు. పిల్లలైతే ఉదయాన్నే చలిలో పాఠశాలకు వెళ్లేందుకు గజగజ వణికిపోతున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా పలు జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 11.2, నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో 11.7, సంగారెడ్డి జిల్లా ఆల్మాయ్‌పేటలో 12.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు.