మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉచిత ప్రయాణంతో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్ల వరకు వారే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నారు. టికెట్ కొని ప్రయాణిస్తున్నా సీట్లు దొరకడం లేదని వాపోతున్నారు. ఈ విషయం కాస్త ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్ మీటింగ్‌లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచన చేస్తున్నట్లు సమాచారం. వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.
సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఇవి సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని సమాచారం.