గ్రీన్ ఎనర్జీ రంగం లో తెలంగాణను లీడర్ గా నిలపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ చేసిన భట్టి ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 15.02 లక్షల కోట్లు, వృద్ధిరేటు 14.5శాతంగా ఉందని.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలుగా ఉందని తెలిపారు.
అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తున్నామన్నదే మెరుగైన ప్రయాణం అని భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భాగస్వామిగా ఉందని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని..భూగర్భ జల వనరులు పెరిగాయని, హైదరాబాద్ పరిసరాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలని కోరారు.