రాష్ట్రంలో మరో రెండ్రోజులు తీవ్రమైన వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

-

తెలంగాణలో ఇప్పటికీ నైరుతి రుతుపవనాల జాడ లేదు. జూన్ మూడో వారం వచ్చేసినా.. ఇప్పటికీ వరణుడి రాక లేదు. ప్రజలంతా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ రేపు కూడా  తీవ్రమైన వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందంటూ ‘ఆరెంజ్‌’రంగు హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ వడగాలుల వీచే ముప్పు ఉందని పేర్కొంది. ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండలోకి తప్పనిసరిగా తలకు వస్త్రం చుట్టుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దాహం అనిపించకపోయినా నీళ్లు తాగాలని… ‘డీహైడ్రేషన్‌’కు గురికాకుండా చూసుకోవాలని సూచించారు. మంగళవారం కూడా ఇవే జాగ్రత్తలు పాటించాలని కోరారు. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది వడదెబ్బతో మరణిస్తున్నందున.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news