తెలంగాణలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. రాష్ట్ర ప్రజలను నాలుగైదు రోజులు అతలాకుతలం చేసింది. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టకుండా చేసింది. కానీ ఇవాళ వరణుడు కాస్త శాంతించాడు. చిన్న గ్యాప్ ఇచ్చి ఈనెల 24వ తేదీ నుంచి మళ్లీ గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 24వ తేదీ నుంచి వరుసగా నాలుగైదు రోజులు విస్తారంగా వానలు పడతాయని తెలిపారు.
దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా చోట్ల ఈ నెల 24వ తేదీ నుంచి 3, 4 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.