తెలంగాణలో రానున్న రెండ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల వల్ల నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో గురువారం రోజున వాన దంచికొట్టింది. చాలా ప్రాంతాల్లో వర్షంలోనే భక్తులు గణేశ్ నిమజ్జనం నిర్వహించారు. గురువారం రోజున కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో అత్యధికంగా 11.8 సెంటీ మీటర్లు.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం 6.1, సిద్దిపేట జిల్లా మద్దూరు 5.5, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ 5.4, నిర్మల్ జిల్లా కుబేర్ 5.1, హైదరాబాద్ జిల్లా మారేడుపల్లి 4.5, నిజామాబాద్ జిల్లా బాల్కొండ 4.3, జగిత్యాల జిల్లా భీమారం 4, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ 3.9, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ 3.7, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 3.4 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో 3 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది.