తెలంగాణలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుముంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుముంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు పడతాయని చెప్పారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.