కాస్త గ్యాప్ ఇచ్చిన వరణుడు మళ్లీ తెలంగాణకు వచ్చేశాడు. బుధవారం రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరోవైపు రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాలలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని పేర్కొంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వాలి ఉందని, రాగల రెండు రోజులలో వాయవ్య దిశగా కదిలి ఝార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని వెల్లడించారు.