కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మరింత దివాళా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, డీఏలు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది.
మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పరిస్థితి మారలేదు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారు. నేడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే వ్యవహరిస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి పనులు అన్ని కుంటుపడ్డాయి. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రకటనలు ముందు పేజీలో ఉన్నాయి కానీ పనులు మాత్రం లేవు. కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లేదు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.