తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటలైనా సూర్యుడి జాడే కనిపించడం లేదు. ముఖ్యంగా రెండ్రోజుల నుంచి భారీగా పొగ మంచు కప్పేస్తోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం పూట బయట అడుగుపెట్టాలంటే జంకుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలు ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంది. మరోవైపు నల్గొండ జిల్లా, మిర్యాలగూడను మంచు దుప్పటిలా కప్పేసింది. ఉదయం ఎనిమిది అయినా సూర్యోదయం కనిపించకపోవడంతో చలికి ప్రజలు బయటికిరాలేని పరిస్థితి నెలకొంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పొగ మంచు భారీగా కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగ మంచు కారణంగా వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై వాహనదారుల ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మూడు రోజులుగా పెరిగిన చలితో భద్రాచలం నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి పెరగడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. పొగ మంచు కారణంగా పలు చోట్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మంచు కురిసినప్పుడు ప్రయాణం చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.