హైదరాబాద్ లోని కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడుల వెనక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్‌రావు ఠాక్రే. ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామునే హైదరాబాద్ నగరంలోని బడంగ్ పేట్ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.
అటు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్‌రావు ఠాక్రే స్పందించారు. ఐటీ దాడుల వెనక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి.. బీజేపీ, బీఆర్ఎస్, ఐఎంఐ ఒక్కటేనన్నారు.. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని వెల్లడించారు. ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారు.. లెఫ్ట్ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. కమ్యూనిస్టులు మాకు అవసరమే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేదే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. కమ్యూనిస్టుల ది.. మాది ఒకటే ఆకాంక్ష అని వివరించారు థాక్రే.