కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి, కూల్చడానికి కాదు అని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాలకుర్తి బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్. అది చేస్తాం.. ఇది చేస్తామనే పిచ్చిమాటలు మాకు రావా..? అని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి.. కానీ ప్రతిపక్ష నేతలను తిట్టడానికి కాదన్నారు.
మాకు మాటలు రావనుకున్నారా..? ఇవాళ మాట్లాడటం మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతా.. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. కూలగొడతామంటూ భయపెడతారా..? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అన్నారు. రౌడీ పంచాయితీలు మాకు కూడా తెలుసు. మేము మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువగా చేశామన్నారు. మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు కేసీఆర్. రేవంత్ రెడ్డి బుల్డోజర్స్ వేసి తొక్కిస్తాం.. జైలులో వేస్తామనే వ్యాఖ్యలపై స్పందించారు కేసీఆర్.