తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మురంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అరెస్టు అయిన ముగ్గురు నైజీరియన్లు సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఈ కేసులోని రిమాండ్ రిపోర్టులోని పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు నవదీప్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. అతనికి డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉన్నట్టు రిపోర్టులో వివరించారు.
నటుడు నవదీప్ ను కేసులో 29వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. నిందితులు తరచూ హైదరాబాద లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించే వారు అని రిమాండ్ రిపోర్టులో వెల్లడి అయింది.విశాఖపట్టణంకి చెందిన రామ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవారని పేర్కొన్నారు. మరోవైపు నటుడు నవదీప్ కి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలోనే నవదీప్ హై కోర్టును ఆశ్రయించాడు. తనకు డ్రగ్స్ కేసుకు సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నవదీప్ ను అరెస్ట్ చేయకూడదని తెలంగా హైకోర్టు ఆదేశం జారీ చేసింది.