గులాంగిరిని అంతం చేసిందే గులాబీ జెండా.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్..!

-

భారత రాష్ట్ర సమితి  వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర విషయం పంచుకున్నారు. గులాబీ జెండాకు 24 ఏళ్ళు అని పేర్కొన్నారు. ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. తెలంగాణ జెండా ఎత్తిన్నాడు కేసీఆర్ వెంట పిడికెడు మంది లేరని, కానీ కేసీఆర్ ఎత్తిన పిడికిల్లకు మూడున్నర కోట్ల పిడికిల్లను జతచేసిండని, ఊరూవాడను ఏకం చేసిండన్నారు. పల్లె గల్లీ తిరుగుతూ ప్రజల మనసులు గెలిచిండన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను చైతన్యపరిచిందని పేర్కొన్నారు.

అంగబలం, అర్థబలం కలిగిన ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డాడని, తెలంగాణ వాదాన్ని అణచివేయజూసిన ప్రతిసారి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిండన్నారు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చ బట్టి విజయాలు సాధించిండు. తెలంగాణ వాదాన్ని గెలిపించిండు. జల దృశ్యం నుంచి జన దృశ్యంగా మారిన పరిణామంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, అణిచివేతలు, అవమానాలు అని తెలిపారు. 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ ఎన్నడూ ఎత్తిన జెండాను దించలేదని, పట్టిన పట్టును విడవలేదన్నారు. ఈ బక్క మనిషితో అయితదా అన్నరు. ఈ జెండా ఉండేదా పోయేదా అన్నారు. కానీ ఈ గులాబీ జెండానే గులాంగిరిని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version