నిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాదం పై మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు. నిమ్స్ డైరెక్టర్ కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదని చెప్పారు. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని అన్నారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేషెంట్లు అందరినీ సేఫ్ ప్లేస్ లోకి తరలించినట్టు చెప్పారు.
శనివారం మధ్యాహ్నం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటికీ రావడంతో అక్కడ ఉన్న పేషెంట్లతో పాటు సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసారు.